minister jagadeesh: సూర్యాపేట మండలం రామచంద్రాపురంలో బొడ్రాయి, కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. భాజపా నేతల కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ చేయడం…. భాజపా దుర్మార్గాలకు పరాకాష్ట అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధాని పాలనలో ఈడీ, ఐటీ, సీబీఐ…..తమ ఉనికిని కోల్పోయాయని విమర్శించారు.
ప్రజలు కచ్చితంగా భాజపాకు తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. భాజపా యేతర ప్రభుత్వాలపై కేంద్రం తీరు దారుణమని, అన్యాయమని మంత్రి స్పష్టం చేషారు. కేంద్ర భాజపా అరాచకాలు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఇలానే కొనసాగితే దేశప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
భాజపా చేష్టలకు ఎవరూ భయపడరని మండిపడ్డారు. అణచివేతలకు, జైళ్లు నింపినంత మాత్రాన ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేనంత పిచ్చివాళ్లు కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సారథ్యంలో అన్ని మతాలకు తగిన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం సమన్యాయం చేస్తోందని తెలిపారు. దేశంలో భాజపా నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో భారాస జెండా ఎగురవేస్తుందని చెప్పారు.