CM JAGAN: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ కొరత ఉండకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరెంట్ కొరత వల్ల విద్యుత్ కోత సమస్యలు రాకూడదని….ఆ విధంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులెప్పుడూ పరిస్థితికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
బొగ్గు నిల్వల విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో ధరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు కనెక్షన్లపై ఎలాంటి అంతరాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇదివరకే ధరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లకుపైగా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 2.18 లక్షలకు పైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నవాటికి కనెక్షన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.