తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం నుంచి ఉదయం 7.00 గంటలకే విధులకు హాజరు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి దృష్ట్యా పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల నిర్వహణ, తనిఖీ కోసం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గతంలో కార్యదర్శులు ఉదయం 9 గంటలకు విధులకు హాజరయ్యేవారు.
సాయంత్రం వరకు విధుల్లో ఉండేవారు. తాజాగా ఉదయం పూట పనివేళలను పెంచినా సాయంత్రం వరకు విధుల్లో కొనసాగాల్సి ఉంటుంది. ఇకపై ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య వారు పంచాయతీ కార్యాలయం చేరుకొని రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్‌ఆర్) యాప్‌లో తమ స్వీయచిత్రాన్ని తీసి పంపించాలి. తర్వాత గ్రామ పంచాయతీలో రోడ్లపై వ్యర్థాలు, మురుగు కాల్వలు, నీటి ట్యాంకులు, పల్లె ప్రకృతివనాలు వీధిదీపాల వద్దకు వెళ్లి అయా చోట్ల ఫొటోలు తీసి పంపించాలి.
ఆ తర్వాత ఆయా పనులను మల్టీపర్పస్ కార్మికులతో చేయించి, ట్రాక్టర్ ట్రాలీ ద్వారా వ్యర్థాలను తరలించే ఫొటోలను కూడా తీసి గంటగంటకూ పంపించాలి. వీధిదీపాలు ఎన్ని వెలుగుతున్నాయి, ఎన్ని వెలగడం లేదు? అనే సమాచారం తెలపాలి. అన్ని వివరాలుంటేనే ఆ రోజు హాజరును నమోదు చేస్తామని పేర్కొంది. వేసవిలో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువ కావడంతో పాటు తాగునీటి సరఫరాను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించానికి వీలుగా మరింత పర్యవేక్షణ కోసం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంత మంది యాప్‌లో తప్పుడు సమాచారం ఇస్తున్నందున ఆయా కార్యదర్శులకు వీడియోకాల్ చేసి తనిఖీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది.