వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు టీడీపీ వైఫల్య పాలనని ఎండగడుతున్నారు. జగన్ పాదయాత్రకి జనాల్లో కూడా విపరీతమైన స్పందన రావడంతో.. టీడీపీ నేతలు వరుసగా అటాకింగ్ మొదలు పెట్టారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి జగన్ పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. చేసిన అప్పులన్నీ తన కొడుకు జగన్ ఎదుగుదలకే ఖర్చు చేశారు తప్పా రాష్ట్రాభివృద్ధికి కాదని విమర్శించారు. మద్యంపై నిషేధం విధిస్తామనే హామీతో నాడు అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి, ఆ మద్యాన్నే ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చేశారని అన్నారు. ఇక జగన్ ప్రజా సంకల్ప యాత్ర గురించి ఆయన ప్రస్తావిస్తూ, అది అబద్ధాల యాత్ర అని అన్నారు.
అంతే కాకుండా అవినీతి ద్వారా అక్రమాస్తులు పోగేసుకున్న జగన్ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు. రైతులకు ఇరవై ఏడు వేల కోట్లు రుణమాఫీ చేయడం ద్వారా దేశంలోనే రికార్డు సృష్టించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. దీంతో ఇప్పటికే వరుసగా జగన్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న టీడీపీ బ్యాచ్‌కి.. రివర్స్ అటాక్ ఇస్తున్న జగన్ రియాక్షన్ పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యల పై ఎలా స్పందిస్తారో అని సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.