BRS Meeting : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వం లో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు అడుగులు వేస్తుంది. కాగా బీఆర్ఎస్ ప్రకటన తర్వాత ఖమ్మంలో తొలిసారిగా ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. కాగా ఈ సందర్భంగా నేతలంతా బీజేపీ పై నిప్పులు చెరిగారు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వారి వారి శైలిలో ఫైర్ అయ్యారు.
ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంపైనా కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కంటి వెలుగు తరహా పథకాన్ని ఢిల్లీలో కూడా తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న సమీకృత కలెక్టరేట్ కాన్సెప్టు చాలా మంచిదని, ప్రజలకు సంబంధించిన అన్ని పనులు ఒకేచోట జరుగుతాయని వివరించారు.
అదే విధంగా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతోందని.. కానీ ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నామని వెల్లడించారు. మన తర్వాత స్వాతంత్రం పొందిన జర్మనీ, సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. ఇక, ఢిల్లీలో తాము ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్ లను ప్రవేశపెట్టామని.. ఈ మొహల్లా క్లినిక్ లను తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పరిశీలించారని కేజ్రీవాల్ తెలిపారు. మొహల్లా క్లినిక్ ల తరహాలోనే తెలంగాణ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గవర్నర్లు కేవలం కీలు బొమ్మల్లా తయారయ్యారని.. మోదీ చెప్పినట్టల్లా ఆడుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే ఈ గవర్నర్ల పని అని వ్యాఖ్యానించారు.
Addressing a public meeting in Khammam, Telangana | LIVE https://t.co/vj5SlbaQTq
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 18, 2023
అలానే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం విజయన్, అఖిలేశ్ యాదవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భాజపాను గద్దె దించేందుకు పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.