జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్ జీ రవిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రభుత్వం కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఎస్సారెస్పీ ఆబాది స్థలం 20 ఎకరాల్లో సమీకృత జిల్లా కార్యాలయాలన్ని రూ.49.20 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఎనిమిది ఎకరాల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. వీటిని 6వేల చదరపు అడుగుల్లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం.. 2,877 చదరపు అడుగులలో అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయం, 2130 చదరపు అడుగులలో జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు.
ఇక జీప్లస్ 2 పద్ధతిలో 19,300ల చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లా స్థాయి అధికారుల గృహ సముదాయాలను నిర్మించారు. ఐడీఓసీలో 32 శాఖలకు గదులను నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల కోసం మూడు పెద్ద చాంబర్లను, విజిటర్స్ వెయింటింగ్ హాల్‌తో పాటు, ఇంటిగ్రేటెడ్ మీటింగ్ హాల్‌ను నిర్మించారు. మూడు మినీ మీటింగ్ హాల్స్‌ను తీర్చిదిద్దారు.