CM KCR : నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ మేరకు సీఎంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం సంబంధిత అధికారులను థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు. ఆ తర్వాత పలువురు అధికారులతో సమావేశమైన కేసీఆర్… పలు కీలక ఆదేశాలు జారీ చేశారని సమాచారం అందుతుంది.
కాగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ ఆపరేషన్ కు కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాదాద్రి ప్లాంట్ నుండి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పవర్ ప్లాంట్ కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరం ఉంటుంది దానికి సంబంధించిన బొగ్గు, నీటి సరఫరా గురించి ఆరా తీశారు. ఈ నీటి సరఫరాకు కృష్ణా నీళ్లను సరఫరా చేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
కృష్ణ పట్నం పోర్టు, అద్దంకి హైవే ను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఉపాధి కల్పించే ఉద్ధేశ్యంతో పవర్ ప్లాంటుకు దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. పవర్ ప్లాంట్ లో పనిచేసే సుమారు పదివేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్ షిప్ నిర్మాణం జరగాలని సీఎం ఆదేశించారు. సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలన్నారు. సిబ్బంది క్వార్టర్స్ ఇతర సదుపాయాల కోసం వంద ఎకరాలు ప్రత్యేకంగా సేకరించాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు యాబై ఎకరాలు కేటాయించాలన్నారు. సూపర్ మార్కెట్, కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీస్ స్టాప్ కి అవసరమైన క్వార్టర్స్ నిర్మించాలన్నారు. టౌన్ షిప్ నిర్మాణంలో బెస్ట్ టౌన్ ప్లానర్స్ సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.