మరోకసారి వార్తల్లో నిలిచారు ప్రముఖ సీనియర్ నటి.. దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్. గతంలో చెక్కు బౌన్స్ కేసులో మీడియాలో విన్పించిన జీవితా రాజశేఖర్ పేరు తాజాగా సైబర్ నేరగాళ్ల సాక్షిగా మళ్లీ సంచలనమైంది. గత కొన్ని రోజుల కింద నటి జీవితా రాజశేఖర్ తమ ఇంట్లోకి జియో వైఫై నూతన కనెక్షన్ తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమ ఇంట్లో వైఫై ఇన్స్టాల్ చేసింది తానేనని చెప్పుకున్న ఓ వ్యక్తి.. తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు.
ఇప్పుడు జియో వస్తువుల అమ్మకాలు జరుపుతున్నానని.. అవి అమ్మితే తనకు మరో ప్రమోషన్ వస్తుందని తెలిపాడు. సగం ధరకే జియో బహుమతులు అందజేస్తానని.. తన ప్రమోషన్ కోసం సహకరించాలని నమ్మబలికాడు. ఇందుకోసం తెలిసిన వాళ్ల పేర్లను వాడుకున్నాడు. అవతలి వ్యక్తి అంతగా వేడుకోవడంతో విషయమేంటో కనుక్కోమని.. జీవితా రాజశేఖర్ తన మేనేజర్లకు చెప్పారు. దీంతో జీవిత మేనేజర్ అతనితో మాట్లాడాడు.సగం ధరకే జియో బహుమతులు అందిస్తానని తెలిసిన వారి పేర్లను చెప్పి నమ్మించడంతో మేనేజర్ ఒప్పుకున్నాడు.
సైబర్ నేరగాడు ఇచ్చిన జాబితాలో నుంచి పలు వస్తువులను ఎంచుకున్నాడు. అయితే వీటికి సంబంధించిన టోకెన్ అమౌంట్ పంపించాలని సైబర్ నేరగాడు అడిగాడు. అతన్ని పూర్తిగా నమ్మిన మేనేజర్ వెంటనే లక్షన్నర రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ కావడంతో సైబర్ నేరగాడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మేనేజర్.. జీవితకు అసలు విషయం చెప్పాడు. దీంతో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు జీవితా రాజశేఖర్ ఫిర్యాదు చేశారు.