AP Government : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏకంగా రెండు గుడ్ న్యూస్ లను జగన్ సర్కార్ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది. సచివాలయాల్లో పని చేసే సర్వే ఉద్యోగులను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి మార్చాలని సీఎం జగన్ను కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సంధర్భంగా సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను వెంకట్రామిరెడ్డి సహా పలువురు అధికారులు కలిశారు.
కాగా 11వేల మంది గ్రేడ్ 3 సర్వేయర్లను గ్రేడ్ 2లోకి మార్చేందుకు సానుకూలంగా స్పందించారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు మార్చి, ఏప్రిల్ నెలలోనే చేసేందుకు అంగీకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎ బకాయిలు జనవరిలో ఇచ్చేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. గ్రామ సర్వేయర్లు, వీఆర్వోల మధ్య గ్రేడ్ తేడా ఉందని సీఎంకు తెలిపామని… సర్వేయర్లు, వీఆర్వోల మధ్య ఉన్న గ్రేడ్లను సరిచేయాలని కోరగానే సీఎం అంగీకరించారని సర్వే డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘం నేత లక్ష్మీ నారాయణ అన్నారు.
గ్రేడ్3 సర్వేయర్లను గ్రేడ్ 2 సర్వేయర్లుగా మార్చేందుకు సీఎం అంగీకరించడంతో 10 వేలమంది ఉద్యోగులకి లబ్ది చేకూరుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను సెప్టెంబర్ లోనే బదిలీలు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని సీఎంకు గుర్తు చేశామన్నారు. గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2 సర్వేయర్లుగా మార్చేందుకు సీఎం అంగీకరించడంపై సర్వే డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ది పధంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్కు వారి తరుపున ధన్యవాదాలు తెలిపారు.