కరోనా అంటే ముందు గుర్తుకు వచ్చే దేశం చైనా.. చైనా దేశంలో పుట్టిన ఆ మహమ్మారి యావత్తు ప్రపంచాన్నే గడగడలాడించడం కాదు ఏకంగా కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను ఆగం చేసింది.. గత కొన్ని నెలలుగా కరోనా అదుపులో ఉందనుకుంటున్న ఈ తరుణంలో తాజాగా చైనా దేశంలో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి కరోనా పాజిటీవ్ కేసులు..
గత కొన్నిరోజులుగా ఆ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో వైరస్‌బారిన పడుతున్న వారిసంఖ్య అమాంతం పెరుగుతుంది. నిన్న ఒక్కరోజు గురువారం నాడు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 31 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం నాడు దాన్ని మించి 32,695 మందికి వైరస్ నిర్ధారణ అయింది.
ఇందులో 3041 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయి.. 29,654 మందికి ఎలాంటి లక్షణాలు లేవని ఆ దేశ వైద్యాధికారులు తెలిపారు. దీంతో వైరస్ విజృంభణను నిలువరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న పట్టణాల్లో లాక్‌డౌన్లు విధిస్తున్నారు.తాజాగా రికార్డయిన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా గ్వాంగ్‌జౌ, ఛోంగ్‌క్వింగ్ పట్టణాల్లో ఉన్నాయి. ఛెంగ్డూ, జినాన్, లాన్‌జౌ, గ్జినా, వుహాన్ పట్టణాల్లో కూడా భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.