CM Kcr : తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ ఐటీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏకంగా 50 బృందాలు రంగంలోకి ఏకకాలంలో మంత్రి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు సీజ్ చేసినట్లు సమాచారం అందుతుంది. దీంతో ప్రగతి భవన్లో తాజాగా సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
తెరాస ఎమ్మెల్యేలుమ మంత్రులపై ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈడీ, ఐటీ దాడుల దృష్ట్యా నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం, క్యాసినో కేసుల దర్యాప్తు నేపథ్యంలో తెలంగాణాలో ఈడీ, ఐటీ అధికారులు అధికార పార్టీ నేతలే లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన సోదరులు, పీఏను లక్ష్యంగా చేసుకొని ఈడీ అధికారులు విచారించారు. కాగా ప్రస్తుతం ఆయన కుమారుడు సాయి కిరణ్కు కూడా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఈ తరుణం లోనే సీఎం కేసీఆర్ యాక్షన్ షురూ చేశారు. ప్రస్తుతం ఈ తనిఖిల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఇందుకు కౌంటర్ గా కేసిఆర్ ఏం యాక్షన్ ప్లాన్ చేస్తారో అని…