తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మొత్తం ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించింది టీటీడీ దేవస్థానం. 1933 తర్వాత ఇప్పుడు వెంకన్న ఆస్తులు వివరాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది టీటీడీ దేవస్థానం. బంగారం డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, నగదు, భూములు రూపంలో శ్రీవారి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయంటే..
దేశంలోనే ముఖ్యమైన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, డబ్బు విలువ దాదాపు రూ.2.50 లక్షల కోట్లు ఉంటుందని వెల్లడించింది టీటీడీ. ఈ మొత్తం ఆస్తిలో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, రూ.16 వేల కోట్ల నగదు డిపాజిట్లు వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో 960 ఆస్తులు ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. రిజస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.75 వేల కోట్లు ఉంటుందని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 1 లక్షా 87 వేల కోట్లు నుంచి 2.1 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక మొత్తం శ్రీవారి ఆస్తుల విలువ విప్రో, నెస్లే సంస్థల ఆస్తుల కంటే ఎక్కువ.