తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ తార హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బాల్య స్నేహితుడు సొహైల్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించింది. తనకు కాబోయే భర్తను కూడా అభిమానులకు పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరికీ సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట దర్శనమిస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో సొహైల్, హన్సిక ఇద్దరూ కలిసి బోటులో షికారు చేస్తున్న ఫొటో ఒకటి గత మూడు రోజులుగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా నటి స్పందించారు. అది ఫేక్ ఫొటో అని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.
రాజస్థాన్ జైపూర్‌లోని ముండోటా కోటలో డిసెంబర్ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శృతి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నది.