చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులు సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపాయి. అలా అవార్డులు ప్రకటించారో.. లేదో.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భిన్నమైన అభిప్రాయాలను వక్తం చేశారు. మొదటగా ఈ వ్యవహారంపై గీతా ఆర్ట్స్‌లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ.. వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు కూడా.
అయితే, ఈ వివాదం ఇంతటితో ఆగలేదు.. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గనేష్ ఒక అడుగు ముందుకేసి ఇవి నంది అవార్డులు కావు, సైకిల్ అవార్డులంటూ వ్యాఖ్యానించాడు. చారిత్రక నేపథ్యంలో తీసిన రుద్రమదేవి సినిమాకు అవార్డు రాకపోవడంపై ఆ చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. సినీ క్రిటిక్ మహేశ్ కత్తి కూడా చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులపై ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. కమ్మోళ్ళ రాజ్యంలో కాపులకు ఎందుకండి అవార్డులు.. మీ కాపు సామ్రాజ్యం పవన్ కళ్యాణ్ తెచ్చేదాకా ఆగలేరా.. మెగా ఫ్యామిలికి అప్పుడు పంచుకొండి పప్పులు.. బెల్లాలు అంటూ కామెంట్ పెట్టాడు.
తాజాగా, కమెడియన్ పృథ్వీ కూడా నంది అవార్డులపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నంది అవార్డుల జాబితా తనకు నచ్చ లేదని పేర్కొన్నాడు. లౌక్యం సినిమాకు గాను తనకు ఉత్తమ హాస్యనటుడు అవార్డు వస్తుందనుకున్నా.. కానీ.. రాలేదని, జ్యూరీలో గిరిబాబు వంటి సీనియర్ నటులు ఉన్నా కూడా ఎందుకిలా జరిగిందో తనకు అర్థం కావడం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒకానొక సమయంలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్న ”కొని తెచ్చుకున్న అవార్డులు బయటకు వెళ్లే వెక్కిరిస్తాయన్న మాట”ను చంద్రబాబు నాయుడు నిజం చేశారన్నారు.
ఏదేమైనా చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులపై ఓ పక్క సోషల్ మీడియాలోనూ.. మరో పక్క మీడియా వేదికగా సినీ ఇండస్ర్టీ ప్రముఖులు ప్రశ్నిస్తున్నా జ్యూరీ సభ్యులు స్పందించకపోవడం దారుణమని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.