‘మేమంతా ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీకే ఓట్లేస్తున్నాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా ఇళ్లను కూల్చేస్తామని, పరిహారం కూడా ఇచ్చేది లేదని చెబుతోంది. జాయింట్ కలెక్టర్ (జేసీ)కి మా గోడు చెబుదామని వస్తే పోలీసులతో కొట్టించారు. మహిళలమని కూడా చూడకుండా నీచంగా ప్రవర్తించారు. ఇక జన్మలో టీడీపీకి ఓట్లేయం’
– గిరిజన మహిళల కన్నీటి ఆవేదన ఇది
అధికారులు ఇళ్లు తొలగించడంతో పరిహారం కోసం రోడ్డెక్కిన గిరిజన మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో గురువారం చోటు చేసుకుంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లలో 205 జాతీయ రహదారి పక్కన గిరిజనులు ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఇంటి పట్టాలు కూడా ఇచ్చింది. అయితే రోడ్ల విస్తరణ పేరుతో అధికారులు ఇటీవల వారందరికీ నోటీసులు ఇచ్చారు. మీ ఇళ్లను మీరే కూల్చేసుకోండి.. లేదంటే మేమే కూల్చేస్తాం.. అందుకయ్యే ఖర్చు కూడా మీపైనే వేస్తాం. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నందుకు మీకు రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చేది లేదంటూ అధికారులు చెప్పడంతో ఆ పేదలంతా తీవ్రంగా బాధపడ్డారు. దీంతో వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.వి.సిద్ధారెడ్డి వారందరి తరపున న్యాయపోరాటానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే బాధితుల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా గురువారం జాయింట్ కలెక్టర్ రమామణి రెవెన్యూ రికార్డుల నిర్వహణపై అధికారులతో సమీక్షించేందుకు స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాకు వచ్చారని తెలుసుకున్న కుటాగుళ్ల గిరిజన మహిళలు తమ గోడు చెప్పుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే జేసీ వారితో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బంగ్లా ముందు ఆమె కారుకు అడ్డంగా బైఠాయించారు. దీంతో పోలీసులు జేసీ కారును మరో దారిలో పంపేందుకు ప్రయత్నించారు. అయితే మహిళలు బంగ్లా గేట్ ముందుకు వెళ్లి మరోసారి జేసీ కారును అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు జేసీ చూస్తుండగానే వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడపడితే అక్కడ తాకుతూ వేసి వారందరినీ బలవంతంగా పక్కకు నెట్టేశారు. లక్ష్మీదేవి అనే గిరిజన మహిళకు కాలుబెణికి తీవ్ర గాయమైంది. పోలీసుల దుశ్చర్యను డాక్టర్ పి.వి.సిద్ధారెడ్డితోపాటు వామపక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు ఖండిచారు.