హైదరాబాద్లోని గోల్కొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తండ్రిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తాళలేక తండ్రి మృతి చెందాడు.
ఇబ్రహీంబాగ్కు చెందిన 60 ఏళ్ల వినాయక శంకరయ్య, నీలమ్మలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురులు. వినాయక శంకరయ్య పెద్దకొడుకు మీరాబాబు మద్యానికి బానిసయ్యాడు. ముసలి తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన మీరాబాబు తాగడానికి డబ్బులు ఇవ్వమని నిత్యం వారిని వేధించేవాడు. డబ్బులు లేవని చెప్పడంతో ముసలివారు అని చూడకుండా వారికి కొట్టేవాడు. బస్తీవాసులు పలుమార్లు హెచ్చరించినా వినేవాడు కాదు. పైగా వారిపైనా తిరగబడేవాడు. సోమవారం కూడా మద్యానికి డబ్బు అడిగాడు. తండ్రి తన వద్ద లేవని చెప్పగా కోపంతో ఇష్టానురీతిలో కొట్టాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ముసలి తండ్రి మరణించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు కొడుకు మీరాబాబును అరెస్టు చేశారు.