ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. ఈ నెల 28న మెట్రో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ సమయంలో హైదరాబాద్‌కు వస్తారనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నవంబర్ 28 సాయం త్రం 3గంటల సమయంలో ప్రధాని నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మెట్రో ప్రారంభ వేదికైన మియాపూర్ చేరుకొని, మెట్రో ప్రారంభం, పైలాన్ ఆవిష్కరణ చేస్తారు. అనంతరం ప్రధాని మియాపూర్ నుంచి అమీర్‌పేట దాకా మెట్రో రైలులో ప్రయాణించి అదే రైలులో తిరిగి వస్తారు. అనంతరం హెచ్‌ఐసీసీలో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరవుతారు. ఆపై ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే విందుకుకూడా హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా అందిన సమాచారం. మొత్తంగా సుమారు 5.30 గంటలపాటు హైదరాబాద్‌లో గడుపుతారని సమాచారం.
