తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆటలు సాగవని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ నేతలతోకలిసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టురెడ్డి బ్రదర్స్ అని విమర్శించారు.
మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.తెలంగాణ అంటేనే బీజేపీకి కక్ష అని శ్రీహరి విమర్శించారు. రాష్ట్రానికి ఆ పార్టీ చేసిందేమీ లేదని, విభజన హామీలను కూడా ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని కిషన్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని ఫైరయ్యారు. బీజేపీని ప్రశ్నిస్తే వారిపై ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని చెప్పారు. బీజేపీ అజెండా అంతా కులాల మధ్య కుంపటిపెట్టడమేనని ఆరోపించారు. బీజేపీ పేద, బడుగు, బలహీనవర్గాలకు శత్రువని చెప్పడంలో సందేహం లేదన్నారు.