తెలంగాణలో రాజకీయం ఏకపక్షమవుతోంది. సబ్బండ వర్గాలు తమ స్వరాష్ట్ర కలను నెరవేర్చిన నాయకుడికి అండగా ఉండేందుకు కదులుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్ని ఏకమై అధికార పార్టీని ఏకాకిని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుండగా, అదే రీతిలో సమాధానం చెప్పాలనే సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చేరికల కార్యక్రమం విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు రాజకీయంగా దడ పుట్టించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఈ మిషన్ విజయవంతం అయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి రాజకీయ వాతావరణం మలుపులు తిరుగుతున్న క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ వ్యూహానికి మరింత పదును పెట్టేందుకు సిద్ధమయ్యింది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలలోని అసంతృప్త, తటస్థ నాయకులను తమ పార్టీ ద్వారాలు తెరిచింది. దీంతో దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ చేరికల సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో తెలంగాణ భవన్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులను మంత్రులు కేటీఆర్, హరీష్‌రావ్, ఈటెల, జూపల్లి కృష్ణారావు, ఇతర ముఖ్య నేతల ప్రసంగం ఆకట్టుకుంది. స్థూలంగా ప్రతిపక్ష పార్టీలను గుక్కతిప్పుకోకుండా టీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది.