ఆకుపచ్చ తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం కోసం మరో ముందడుగు పడింది. ఈ పథకం విజయవంతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా హరిత సైనికులను ఏర్పాటు చేశారు. వీరికి సైకిళ్లను అందజేసి నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను అప్పగించారు. ఇటీవల ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా ప్రతి గ్రామానికి 1200 మొక్కలను అందజేశారు. గ్రామంలోకి వెళ్లేదారి వెంట వీటిని నాటారు. మొక్కలు నాటగానే బాధ్యత తీరిపోయిందనుకోకుండా వాటిని సంరక్షించినపుడే వాటి ఫలితాలు భావితరాలకు అందుతాయని హరిత సైనికులను ఏర్పాటు చేశారు.
ఒక్కో హరిత సైనికుడికి సైకిలును అందించి ఆయా గ్రామాల పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యతలను అప్పగించారు. హరిత సైనికులు రోజూ మొక్కల సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తూ మొక్కలు ఎండిపోకుండా చూడటమే కాకుండా రోజూ వాటికి నీళ్లు పోసే బాధ్యతలను అప్పగించారు. తెల్లవారుజాము నుంచే సైకిళ్లపై హరిత సైనికులు తిరుగుతూ ప్రతి మొక్కను పరిశీలిస్తూ వాటి సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయడమే కాకుండా ఎండిపోకుండా రోజూ నీళ్లు పోస్తారు. పచ్చని పల్లెలను రూపొందించడంలో హరిత సైనికులు ఇప్పుడు కీలకంగా మారారు. సిద్దిపేట జిల్లాలో ప్రారంభమైన వినూత్న కార్యక్రమం ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. రానున్న రోజుల్లో వీటి ఫలితాలు ప్రజలకు అందుతాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు. జిల్లాలోని హరిత సైనికులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు కితాబు ఇచ్చారు. హరిత సైనికుల స్ఫూర్తిని ప్రజలు అందుకుంటే మరింత పచ్చదనం వెల్లివిరుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.