గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలపై శాసనసభలో చర్చ జరుగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానం ఇస్తూ… కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఐదో తరగతి తరువాతే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 వరకు బాలికల గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడేళ్లుగా గురుకులపాఠశాలల్లో ఎన్నో విజయాలు సాధించామని వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న పూర్ణ, ఆనంద్‌లు ఎవరెస్ట్‌పై తెలంగాణ జెండా ఎగురవేశారు. గురుకుల విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు ఐఐటీ 60, ఐఐఎం, ఎంబీబీఎస్ 87, ఎన్ఐటీ-174, ట్రిపుల్ ఐటీ-4 కాలేజీల్లో సీట్లు సాధించారు. మూడేళ్లలో 53 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఉన్న 801 గురుకులాల్లో 3.32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందిస్తున్నాం. 2012 లోనే సీఎం కేసీఆర్ తెలంగాణ భవిష్యత్ గురించి చర్చించారు. మూడేళ్లలో 500లకు పైగా రెసిడెన్సియల్ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యాభివృద్ధికి 2022 నాటికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. కోర్టులో కేసు నడుస్తున్నందున టీచర్ల సమ్మెపై నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పారు. గురుకుల విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు 90 శాతం మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారని వెల్లడించారు.