బీసీసీఐ అధ్యక్ష ఎన్నికకు మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ పోటీపడుతున్నారు. బీసీసీఐ అధ్యక్ష పోస్టు కోసం ఈ రోజు మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్థుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్థానాన్ని రోజర్ బిన్నీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక బీసీసీఐ కార్యదర్శిగా జే షా కొనసాగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం ముంబైలో జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశాల్లో ఈ విషయాలు స్పష్టమైనట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 18వ తేదీన జరగనున్నాయి.
1983 వరల్డ్‌కప్ గెలిచిన ఇండియన్ జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడు. ఆ టోర్నీలో ఆల్ రౌండర్ పాత్రను బిన్నీ పోషించారు. ప్రస్తుతం కర్నాటక క్రికెట్ సంఘంలో ఆఫీసు బేరర్‌గా బిన్నీ కొనసాగుతున్నారు. గతంలో బీసీసీఐ సెలక్షన్ సభ్యుడిగా ఉన్నారు. ఇక బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ పోస్టు కోసం పోటీ చేస్తున్న వారు మంగళ, బుధవారాల్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. 13వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా 2019 అక్టోబర్‌లో సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. అయితే త్వరలో జరగబోయే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మెన్ ఎన్నికల్లో గంగూలీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గంగూలీ బీసీసీఐ నుంచి తప్పుకుంటున్నారు.బీసీసీఐ ఉపాధ్యక్షుడి రేసులో రాజీవ్ శుక్లా ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.