పోయిన డబ్బు తిరిగి రాదు.. పోయి అడుక్కు తినండి.. ఇది ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి డీఎస్పీ ఇచ్చిన సమాధానం. లక్కీడ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఆర్ఎంపీని వలలో వేసుకోగా అతడు ఏకంగా రూ. 15 లక్షలు వారి ఖాతాల్లో వేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసుల దగ్గరకు పరుగు తీయగా వారి రియాక్షన్ ఇలా ఉందని జిల్లా ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు ఆర్ఎంపీ. అసలేం జరిగిందంటే..
పుట్లూరు మండలం కొండాపురానికి చెందిన ఆర్ఎంపీ వెంకటేశ్. ఇటీవల ఓ లక్కీడ్రా గెలుచుకున్నావంటూ సైరబ్ నేరగాళ్లు ఆయనకు వల వేశారు. అది నిజమేనని నమ్మిన వెంకటేశ్ టాక్స్‌లు, అవి ఇవి అని వారు చెప్పగానే నమ్మి రూ.15 లక్షలు సైబర్ నేరగాళ్లు ఇచ్చారు. తర్వాత మోసపోయానని తెలుసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వారు పట్టించుకోకపోవడంతో ఈనెల 19న స్పందనలో ఎస్పీ ఫక్కీరప్పకు తన గోడు వినిపించారు. ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేశారు. 22న ఆర్ఎంపీని తాడిపత్రి డీఎస్పీ చైతన్య ముందు హాజరుపరిచారు. ఆ సమయంలో డీఎస్పీ పోయిన డబ్బు తిరిగిరాదు.. పోయి అడుక్కు తినండని తిట్టారని, మీ ఇంటికి నేను వస్తా.. నేను నీ భార్య, నువ్వు భజన చేసుకుందాం అంటూ దారుణంగా మాట్లాడారని ఆర్ఎంపీ ఫకీరప్పకు లెటర్ రాశారు. ఎలా అయినా తమకు న్యాయం చేయాలని కోరారు. లెటర్ రాసి ఆర్ఎంపీ అదృశ్యమయ్యారు. ఆయన కోసం గాలించగా హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడి కోసం
ఆర్ఎంపీ వెంకటేశ్‌ను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల కోసం పోలీసులు ఆదివారం కోల్కత్తా వెళ్లారు. ఇప్పటికే సుమారు రూ.2.50 లక్షలు రికవరీ చేశామని పుట్లూరు ఎస్ఐ గురుప్రసాద్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పూర్తి డబ్బు రికవరీ చేస్తామని తెలిపారు.