# నంది రాజకీయాలు.. గుణశేఖర్ ఆవేదన.. సోషల్ మీడియాలో సంచలనం..!
ఏపీ ప్రభుత్వం 2014,2015, 2016 సంవత్సరాలకి గానూ వరుసగా నంది అవార్డులు ప్రకటించింది. దీంతో నంది అవార్డుల విషయంలో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని సినీ వర్గీయుల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఈ అవార్డుల ప్రకటనలో హేతుబద్ధత లోపించిందని.. అర్హత ఉన్న చిత్రాలను పక్కన పెట్టేశారంటూ నంది అవార్డులు ప్రకటించిన తీరుపైన విమర్శల వెల్లువ మొదలైంది.
ఇక మరోవైపు రుద్రమదేవి చిత్రానికి ఏ ఒక్క కేటగిరీలోనూ అవార్డు దక్కకపోవడంపై ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ మండిపడ్డారు. ఈ విషయంపై స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. తాజాగా ప్రకటించిన నంది అవార్డుల్లో మహిళా ప్రాధాన్యత ఉన్న చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవికి నంది అవార్డ్ వచ్చే అర్హత లేదా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు..
రుద్రమదేవికి వినోదపు పన్ను మినహాయింపు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించానని.. శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను ఇచ్చినప్పడు రుద్రమదేవికి ఎందుకు ఇవ్వరని అడిగినందుకే మూడేళ్ల పాటు అవార్డులకు అనర్హులుగా ప్రకటించడం దారుణం అని.. ప్రశ్నించడం తప్పా.. ప్రశ్నిస్తే అనర్హులుగా ప్రకటించడమేంటీ.. విచిత్రంగా ఉందే.. ఎటు పోతున్నాము మనము.. మా చిత్రానికి నంది ఇవ్వకపోవడానికి మీకారణాలు మీరు చెప్పుకోండి అంతేగానీ.. అనర్హులనడానికి వాళ్ళకెక్కడిదట అర్హత..?
అసలు మనం ఏదేశంలో ఉన్నాం.. స్వతంత్ర భారతంలోనేనా.. మహిళా సాధికారతని చాటి చెప్తూ తీసిన రుద్రమదేవి ఎందుకు మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎంపిక కాలేకపోయింది.. కనీసం జ్యూరీ గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయిందా.. లేక మరిచిపోయిన చరిత్రను వీడెవరో వెతికి సినిమా తీసి గుర్తు చేశాడు. మళ్లీ ఇప్పుడు అవార్డులు ఇచ్చి గుర్తు చేయడం ఎందుకనుకున్నారా.. లేక ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే.. సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారా.. అదే నిజమైతే రుద్రమదేవిలాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి అంటూ నంది అవార్డ్స్ పట్ల గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గుణశేఖర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.