తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటుడు.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ కృష్ణంరాజు ఈ రోజు తెల్లారు జామున మరణించిన సంగతి తెల్సిందే. అయితే కృష్ణంరాజు మృతికి గల కారణం గురించి హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆసుపత్రి ఏఐజీ దవాఖాన వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.
హీరో ‘కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ బాధపడుతున్నారు.
పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన దవాఖానలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం వల్ల హాస్పిటల్లో చేరిన నాటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన వైద్యం చేశాం. ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు కన్నుమూశారు’ అని వైద్యులు తెలిపారు.