తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన రీతిని చూసి, బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు నేతలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగరావు గులాబీ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురు నేతలు తెలంగాణకు న్యాయం చేసే పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొంటూ అందుకే తాము గులాబీ సేనలో భాగమయ్యామన్నారు. గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వం లో బంగారు తెలంగాణా నిర్మాణం లో భాగస్వామ్యం కావాలని టీఆర్ఎస్ పార్టీలో చేరానని పేర్కొన్నారు. 36 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సేవలు అందించానో అదే విధంగా టీఆర్ఎస్ పార్టీకోసం కష్టపడుతానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి రాష్ట్ర పునర్నిర్మాణానికి అహర్నిశలు కష్టపడుతానని వివరించారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించిన దాన్ని అత్యంత సమర్థంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.
అన్నమనేని నరసింగరావు మాట్లాడుతూ 3000 కోట్ల రూపాయల నిధులతో సిరిసిల్ల పట్టణంలో చేపట్టిన అభివృద్ధికి ఆకర్షితులమై టీఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణం లో మా వంతు పాత్ర పోషిస్తామని అన్నారు. కర్రు నాగయ్య మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్ట్ తో మంథని ప్రాంతం లోని భూములు సస్యశామలం కానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గంలో సీఎం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులం అయి టీఆర్ఎస్‌లో చేరుతున్నామన్నారు. ఆంధ్ర పార్టీ అయిన టీడీపీకి ఇక తెలంగాణాలో స్థానం లేదని ఆయన ప్రకటించారు.