తెలంగాణ రాష్ర్టానికే ప్రతిష్టాత్మకంగా ఉన్న ఆవిష్కరణల కేంద్రం టీ మబ్ తన ఖ్యాతిని మరింత విస్తృతం చేసుకుంటోంది. ఇతర రాష్ర్టాల వారికి ఆదర్శంగా నిలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా నేతృత్వంలో వచ్చిన బృందం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించింది. మంత్రి కేటీఆర్, ఇతర నాయకులు వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి కేటీఆర్‌తో మనీష్‌సిసోడియా బృందం సమావేశం అయ్యింది.
ఢిల్లీలో టీ-హబ్ తరహా ప్రాజెక్టు ఏర్పాటు క్రమంలో మనీష్‌సిసోడియా మంత్రి కేటీఆర్‌తో చర్చించారు.ఆ తర్వాత మనీష్‌సిసోడియా బృందం గచ్చిబౌలిలోని టీ-హబ్‌ను సందర్శించింది. మనీష్‌సిసోడియాతోపాటు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్, పలువురు ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆయన కితాబు ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ బాగా పనిచేస్తోందని…ఇంక్యుబేటర్లు, స్టార్ట్ అప్ లను బాగా ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. ఢిల్లీలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేస్తాం, తెలంగాణ సహకారం తీసుకుంటామని అన్నారు.
రాజకీయాల్లో ఆప్, టీఆర్ఎస్ కలిసి పనిచేసే విషయాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుందని మనిష్ సిసోడియా తెలిపారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్తామని అన్నారు. మంచి విధానాల్లో పరస్పరం సహకరించుకుంటామని అన్నారు.