స్కూల్ నుంచి వస్తున్న ఓ బాలుడిని పెంపుడు కుక్క కరిచింది. నొప్పితో ఏడుస్తున్న ఆ బాలుడిని చూసి కూడా ఏం పట్టనట్లు జాలి దయ లేకుండా అలా చూస్తూ నిల్చొంది కుక్క ఓనర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళ బిహేవియర్‌కు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో ఉంటున్న ఓ బాలుడు సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఇందుకు వాళ్ల సొసైటీలో ఉన్న లిఫ్ట్ ఎక్కాడు. అదే లిఫ్ట్‌లో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో ఎక్కింది. కొద్దిసేపటికి కుక్క ఆ బాలుడి కాలిపై కరిచింది. నొప్పితో ఏడుస్తూ భయపడుతున్న ఆ బాలుడ్ని చూసి కూడా ఆ మహిళ ఏమీ పట్టనట్లు అలా ఉండిపోయింది. కనీసం రెస్పాండ్ అవ్వలేదు. లిఫ్ట్‌లో ఎవరూ చూడలేదు అనుకుంది. అయితే లిఫ్ట్‌కు సీసీ కెమెరా ఉండడంతో అక్కడి దృశ్యాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోను అకాశ్ అశోక్ గుప్తా అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేయగా నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై ఘజియాబాద్ పోలీసులు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో సదరు మహిళపై కేసు నమోదు చేశారు.