మరో నాలుగు రోజుల్లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సమయంలో బాయ్‌కాట్ లైగర్ అందర్లో కాస్త కంగారు రేపుతుంది. మరోవైపు లైగర్ టీమ్ జోరుగా ప్రచారం జరుపుతుంది. తాజాగా విజయవాడలో లైగర్ టీమ్ విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా బాయ్‌కాట్ లైగర్ అంశంపై విలేకర్ల ప్రశ్నించగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
బాలీవుడ్లో అసలు ఏం గొడవ జరుగుతుందో పూర్తిగా తనకు తెలియదని విజయ్ చెప్పారు. సినిమాను అభిమానించి ఆదరించే ప్రజలు, ప్రేక్షకులు ఉన్నంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. నేను హైదరాబాద్‌లో పుట్టా. ఛార్మి పంజాబ్‌లో పుట్టింది. పూరీ జగన్నాథ్ సార్ నర్సీపట్నంలో పుట్టారు. మేము కరెక్ట్ గానే ఉన్నాం. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాం. మేం సినిమా రిలీజ్ చేసుకోకూడదా.. ఇంట్లో కూర్చోవాలా.. ప్రమోషన్ష్ కోసం ఏ రాష్ట్రానికి వెళ్లినా ప్రజలు మమల్ని ఎంతో అభిమానిస్తున్నారు. వాళ్ల కోసమే మేము ఇలాంటి సినిమా తీశాం. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటో తెలుసా.. ఓ తల్లి తన బిడ్డను ఛాంపియన్‌ను చేసి, జాతీయ జెండాను ఎగురవేయాలనుకోవడం. అలాంటి కథను ప్రేక్షకులకు చూపించాలి అనుకుంటే బాయ్‌కాట్ చేస్తారా.. దీని అంతటికీ కారణమైన వారిని ఏమనాలో నాకే అర్థం కావడం లేదు. మన వాళ్ల ఉన్నంత వరకు భయపడాల్సిన పని లేదు. మన ధర్మం మనం పాటించినప్పుడు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. ఏది ఎదురొచ్చినా కొట్లాడటమే. ఈ దేశం, ప్రజల కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే. కంప్యూటర్ ముందు కూర్చొని ట్వీట్లు చేసే బ్యాచ్ కాదు మేము. దేనికైనా ముందడుగు వేసేది మనమే. అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.