కొవిడ్ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి రెండు రోజులకు సరిపోయే పరిస్థితి నెలకొందన్నారు.
ఈ మేరకు మంగళవారం హరీశ్‌రావుకు కేంద్రమంత్రికి లేఖ రాశారు.కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 106శాతం సాధించిందని, రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో 104శాతం సాధించామన్నారు. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి వాక్సినేషన్‌లోనూ దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రికాషనరీ డోస్ విషయంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్ మేరకు ప్రతీ రోజు 3 లక్షల డోస్‌లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ.. వాక్సిన్ కొరతతో రోజుకు కేవలం 1.5 లక్షల డోస్‌లు మాత్రమే ఇవ్వగలుగుతున్నామన్నారు. ప్రస్తుత డిమాండ్ మేరకు మాకు వాక్సిన్ సరఫరా కావడం లేదని, రాష్ట్రంలోని డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ సరఫరా ఎప్పటికప్పుడు పెంచాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిషీల్డ్ డోస్‌లు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, వెంటనే 50 లక్షల కోవిషీల్డ్ డోస్ వాక్సిన్ రాష్ట్రానికి పంపాలని కోరారు.