కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వేర్వేరుగా అమిత్‌షాతో సమావేశమయ్యారు.
తెలంగాణ వరద సాయం కోసం అమిత్‌షాను కలిసిన ట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వరదలతో రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ విషయంపై అమిత్‌షాతో చర్చించినట్లు తెలిపారు. పదవుల కోసం వెంటపడే వ్యక్తిని కాదని.. ఒక పార్టీ మారాలనుకుంటే బరాబర్ మారతానని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి గుర్తుచేశారు.
మరోవైపు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి కూడా అమిత్‌షాతో సమావేశమయ్యారు. బీజేపీలో చేరిక, మునుగోడులో నిర్వహించే బహిరంగసభపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. సొంత నియోజకవర్గంలో భారీ సభ ఏర్పాటు చేసి అక్కడే బీజేపీలో చేరాలని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకే రోజు అమిత్‌షాతో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.