తల్లంటే కొడుకుకి ఎనలేని ప్రేమ.. కొడుకంటే తల్లికి పంచ ప్రాణాలు. అమ్మను వదిలి తనయుడు ఉండలేడు. కొడుకును చూడలేక తల్లి ఉండలేదు. చివరి శ్వాస వరకు ఆ తల్లికొడుకులు ఇలాగే ఉన్నారు. కుమారుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగి పోయింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జాడీ జమాల్‌పూర్‌కు చెందిన గాలి అన్సయ్య, శౌరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారులు ముగ్గురూ ఆర్మీలో చేరారు. 12 ఏళ్ల క్రితం భర్త చనిపోయారు.
ఈమె పెద్ద కొడుకు విజయ్‌కుమార్ ఆర్మీ ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్ లోని ఇండియన్ ఇమ్మునోలాజికల్లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం విధినిర్వహణలో ఉండగా బ్రెయిన్‌స్ట్రోక్ రావడంతో సహోద్యోగులు గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. కుమారుడి మరణవార్త విని శౌరమ్మ గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చింది. ఆయన మృతదేహాన్ని అంబులెన్స్‌లో జమాల్ పూర్‌కు తరలిస్తుండగా కారులో కూర్చున్న శౌరమ్మ గుండెపోటుకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గురువారం జమాల్‌పూర్‌లో తల్లీకొడుకులకు అంత్యక్రియల్ని నిర్వహించారు.