ఇవాళ శాసనసభలో రైతులకు పెట్టుబడి, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరపూరిత నిర్లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యాఖ్యలపై సీఎం నిప్పులు చెరిగారు. కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉన్న తెలంగాణలో 23 లక్షల 62 వేల పంపుసెట్లు ఎవరి పుణ్యమా అని వచ్చాయని సీఎం ప్రశ్నించారు.
తెలంగాణకు 1330 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే ఎన్ని టీఎంసీలు వాడారు? వాడకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం? కాదా అని ప్రశ్నించారు. 45 వేల చెరువులు ఉంటే.. 4 చెరువుల్లో అయినా పూడిక తీశారా? మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. 9 గంటల కరెంట్ ఎప్పుడైనా వచ్చిందా? 2 లేదా 3 గంటలు కరెంట్ వస్తే మహాగొప్ప.. ఇవన్నీ నేరపూరిత నిర్లక్ష్యం కాదా? అని సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు. వందశాతం నిష్పక్షపాత వైఖరితో ముందుకు వెళ్తున్నామని సీఎం ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 3 కోట్లు ఇస్తున్నాం. మీరిచ్చిరా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది నేరపూరిత నిర్లక్ష్యం అని సీఎం అడిగారు. రైతు సమన్వయ సమితులు ఎందుకని వెంకట వీరయ్య ప్రశ్నిస్తున్నారు.. మరి టీడీపీ ప్రభుత్వం 2005లో రైతు మిత్ర బృందాలు ఎందుకు ఏర్పాటు చేశారని సీఎం ప్రశ్నించారు. 2 లక్షల రైతు మిత్ర బృందాలు ఏర్పాటు చేసి రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారని సీఎం తెలిపారు.
ఇక 2005లో 50 వేల మంది ఆదర్శ రైతులను ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 60 కోట్లు ఖర్చు చేసి.. ఆదర్శ రైతులుగా ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లను నియమించారని సీఎం తెలిపారు.ఏ అధికారం లేకపోయినా.. బక్క, పేద కార్యకర్తలే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. మేం పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ సాధించామని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లే రైతు సమన్వయ సమితిలో ఉంటారని సీఎం స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితి సభ్యులకు అధికారాలు ఉండవు.. జీతాలుండవు అని స్పష్టం చేశారు. రైతులకు సేవ చేయడానికే సమన్వయ సమితులు అని తెలిపారు.రాష్ట్రంలో 56 లక్షల మంది రైతులు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారని సీఎం తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం ఉన్న 56 లక్షల మంది రైతులు కాదా, సమితులకు అర్హులు కారా? అని ప్రశ్నించారు. వ్యాపారుల వద్ద గిట్టుబాటు ధర లభించకపోతే పంటను రైతు సమన్వయ సమితులు కొంటాయన్నారు. భూరికార్డులతో రైతు సమన్వయ సమితులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కేసీఆర్.