డబుల్ ఇంజిన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన వై.సతీష్ రెడ్డి శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లోని రెడ్కో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు జగదీష్ రెడ్డి,దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు,పోచంపల్లి శ్రీనివాస రెడ్డి,నవీన్ రావు,తాత మధు, శాసనసభ్యులు దానం నాగేందర్, మాగంటి గోపినాధ్ ఆరురి రమేష్,కార్పొరేషన్ చైర్మన్ లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, వాసుదేవరెడ్డి,గజ్జెల నగేష్, దామోదర్ , రెడ్కో వి.సి&యం డి వి.జానయ్య,జనరల్ మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పదవీ బాధ్యతలు శ్రీకారం అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ వాట్సాప్ యూనివర్సిటీల కేంద్రంగా బిజెపి అసత్యప్రచారాలకు దిగుతోందని ఆయన పేర్కొన్నారు. అటువంటి అసత్యాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఆయన చెప్పారు.
గుజరాత్ నమూనాను చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి అదే గుజరాత్ ను ఇప్పుడు చీకట్లోకి నెట్టేసిందన్నారు.వ్యవసాయానికి ఆరు గంటలు కూడ కరెంట్ ఇవ్వకపోగా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించిన అంశాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. యావత్ భారతదేశంలో చీకట్లు అలుముకున్న రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా లో వెలుగులు నింపిందన్నారు.అటువంటి నాయకుడి నేతృత్వంలో జరిగిన తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. రెడ్కో చైర్మన్ గా సతీష్ రెడ్డి నియామకం అందులో భాగంగా జరిగిందేనన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.శత్రుదుర్బేద్యమైన కోట గా టి ఆర్ యస్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. నిర్మాణాత్మక మైనపార్టీగా ప్రజల నుండి అనూహ్యమైన ఆదరణ టి ఆర్ యస్ కు లభిస్తుందన్నారు.సభ్యత్వ నమోదు కోసం ప్రజలు బారులు తీరడమే ఇందుకు అద్దం పడుతుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనమే ఇందుకు కారణంగా నిలుస్తుందన్నారు.