ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ ఘాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పకే అందిన సమాచారం ప్రకారం 18 మంది పర్యాటకులు మృతిచెందారు. బోటులో మొత్తం 38 మంది ఉండగా, గల్లంతైన 9 మంది ప్రయాణికుల కోసం పెద్దెత్తున గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పర్యాటకుల్లో ఎక్కువగా ప్రకాశం నెల్లూరు జిల్లా వారు కావడం గమనార్హం.
ఇక ప్రమాదం విషయం గురించి ఆరా తీయగా.. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే కృష్ణా నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ నుండి అనుమతులు కావాలి. అయితే కేవలం ప్రైవేట్ సంస్థలకు చెందిన నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారని తేలింది. ఇదే విషయాన్ని విజిలెన్స్ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇక ప్రమాదానికి సంబందించి కారణాలు గురించి ఆరా తీయడం మొదలు పెడితే.. షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. బోటు ప్రమాదానికి అనేక కారణాలు ఉన్నా.. ముఖ్యమైన కారణం మాత్రం అధికార పార్టీ అయిన టీడీపీ నేతల ధనదాహమే ముఖ్యకారణమనే సమాధానం అక్కడి స్థానికులు నుండి వస్తోంది. ఫెర్రీ ఘాట్ కి సమీపంలో దాదాపుగా 45 అడుగుల లోతువరకు భారీగా ఇసుక తవ్వకాలు జరిగాయని.. దీంతో ఆ ప్రాంతమంతా గోతుల మయం అయ్యిందని.. నదికి ఒడ్డున ఉన్న ఇసుక మొత్తం నీటి ప్రవాహానికి గోతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో బోటు నడిపే డ్రైవర్లు నదీ ప్రవాహాన్ని అంచనా వేయలేక పోతున్నారు. అందుకే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.