నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోజూ తన పిచ్చిమాటలు, అబద్ధాలతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడంలో గోబెల్స్‌ను మించిపోయాడని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు తాను టీఆర్‌ఎస్ నుండి మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ కొట్టిపారేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా హస్తం గుర్తుపై తనను రెండుసార్లు గెలిపించినట్టుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
2009 ఎన్నికల్లో కోమటిరెడ్డికి 60,665ఓట్లు వస్తే తనకు 68,987ఓట్లు వచ్చాయని, 2014ఎన్నికల్లో కోమటిరెడ్డికి 60,774ఓట్లు వస్తే తనకు 66,339ఓట్లు వచ్చిన సంగతి మరిచి కోమటిరెడ్డి అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. 2004ఎన్నికల్లో ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాను టీఆర్‌ఎస్, సీపీఐ, కాంగ్రెస్‌ల అభ్యర్ధిగా పోటీచేసి కోమటిరెడ్డిపై ఓడిపోవడం జరిగిందన్నారు.గత రెండు ఎన్నికల్లోనూ 60వేల చొప్పున ఓట్లు సాధించిన కోమటిరెడ్డి ఇక్కడ సీఎం కెసిఆర్ పోటీచేస్తే ఆయనపై 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానంటూ చెప్పడం కోమటిరెడ్డి అబద్ధాలకు నిదర్శనమన్నారు.
మూడుసార్లు ఎంపీగా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్న క్రమంలో స్వరాష్ట్రం అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి మద్దతుగా తెలంగాణ కోసం పార్లమెంటు లోపల, బయట ఉద్యమించిన తాను టీఆర్‌ఎస్‌లో చేరానని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఇన్నాళ్లుగా జిల్లా ప్రజల ఆకాంక్షలైన నల్లగొండ బత్తాయి మార్కెట్, పిఏపల్లిలో దొండ మార్కెట్, నల్లగొండ, సూర్యాపేటల్లో రెండు మెడికల్ కళాశాలలు తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మంజూరు చేయించుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగం మార్గం ప్రాజెక్టులో భాగమైన లోలెవల్ కెనాల్ పూర్తి చేసుకోగా, ఉదయ సముద్రం ఎత్తిపోతల, సొరంగం పనులు, నక్కలగండి, పెండ్లిపాకల రిజర్వాయర్లు త్వరలో పూర్తికానున్నాయన్నారు. దేవరకొండ, మునుగోడు ప్రాంతా ఫ్లోరైడ్, కరవు నిర్మూలనకు డిండి ఎత్తిపోతల పథకం సీఎం కేసీఆర్ నిర్మింప చేస్తున్నారని ఈ అభివృద్ధిని కోమటిరెడ్డి వంటి నేతలు గమనించాలన్నారు.