ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మెయిన్‌బజార్‌లో టీ తాగారు. మెయిన్‌బజార్‌లో వెళుతూ అలా పక్కన ఉన్న టీ కొట్టుకెళ్లి ‘యాసిన్ భాయ్.. ఏక్ ఛాయ్ దాలో భాయ్’.. అని అడిగి సాధారణ వ్యక్తిలా టీ తాగారు. టీ తాగుతూ యాసిన్ కష్టనష్టాల గురించి వాకబుచేశారు. ఒక్కో టీ ఎంతకు అమ్ముతున్నావు.. పాలు లీటర్ ఎంతకు కొనుగోలు చేస్తావు.. మిగులుబాటు ఎంత.. తదితర వివరాలు అడిగారు. దానికి యాసిన్ టీ రూ.5కి అమ్ముతున్నానని, లీటర్ పాలు రూ.50కి కొనుగోలు చేస్తున్నానని, మిగులుబాటు అంతంతమాత్రంగానే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇంట్లో ఏమేం వస్తువులున్నాయని వైఎస్ జగన్ ప్రశ్నించగా.. యాసిన్ తన ఇంట్లో ఉన్న వస్తువుల వివరాలు వెల్లడించారు. కరెంటు బిల్లు ఎంత వస్తుందని జగన్ ప్రశ్నించగా.. రూ.1,000 నుంచి 1,500 వరకూ వస్తోందని, వైఎస్సార్ హయాంలో రూ.300 నుంచి రూ.400 లోపే వచ్చేదని తెలిపారు. రేషన్ షాపుల్లో చక్కెర, పామాయిల్ లాంటివి ఇవ్వడంలేదని, బియ్యం మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న కాలంలో మీరే సీఎం అయితే తమకు మంచికాలం వస్తుందని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్‌తో యాసిన్ చెప్పారు.