సహజంగా చాలా మంది కూరగాయాల్లో ముఖ్యమైన ఆలుగడ్డలను ఇష్టపడతారు. కానీ వీటిని ఎక్కువగా తినాలంటే భయపడతారు. ఎందుకంటే ఆలుగడ్డలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుందని ప్రచారం ఎక్కువగా ఉంది. ఆలుగడ్డలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువ. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే అయినా.. సరైన పద్ధతిలో తింటే ఇబ్బంది లేదు.
♦ ఆలుగడ్డల్లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్-సి, బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా అధికమే. విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఈ విటమిన్ వల్ల సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి చక్కగా నిద్ర పడుతుంది.
♦ ఆలుగడ్డల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీంతో పెద్దపేగు వాపులు, క్యాన్సర్, అల్సర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
♦ ఆలుగడ్డలలోని ప్రొటినేజ్ ఇన్‌హిబిటర్ 2 (పీఐ2) అనే ప్రొటీన్ ఆకలిని నియంత్రిస్తుంది. అందువల్ల ఆలుగడ్డలను కొద్దిమొత్తంలో తిన్నా చాలు ఎక్కువసేపు ఆకలివేయదు. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
♦ ఆలుగడ్డలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తాయి. శరీరానికి సరిపడా పొటాషియం అందకపోతే సోడియం స్థాయులు పడిపోతాయి. దానివల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాంటి సమయంలో.. పొటాషియం ఎక్కువగా ఉండే ఆలుగడ్డలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆలూలోని ఐరన్, క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి.
♦ ఆలుగడ్డ సౌందర్య పోషణలోనూ ఉపయోగపడుతుంది. ఆలుగడ్డ జ్యూస్ లేదా ముక్కలతో ముఖానికి మసాజ్ చేస్తే నల్లమచ్చలు, ముడతలు తగ్గుతాయి.
♦ ఊబకాయం, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు ఆలుగడ్డలను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అందులోనూ ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ రూపంలో కాకుండా పొట్టుతోపాటు ఉడికించిన ఆలూ ఆరోగ్యానికి ఎంతో మేలు.