మీ ఇంట్లో చిన్నపిల్లలు తినకుండా ఇబ్బంది పెడుతున్నారా..?! అన్నం తినడానికి మారాం చేస్తున్నారా..?.అయితే ఈ చిట్కాలను ఉపయోగిస్తే వాళ్లను దారికి తెచ్చుకోవచ్చు.అన్నం తినిపించవచ్చు..
♥ పిల్లలు తల్లిదండ్రులనే అనుసరిస్తారు. పెద్దలు తినే వాటినే ఇష్టపడతారు. కాబట్టి.. మీరు తినేటప్పుడే వారికీ తినిపించండి. మీరేం తింటున్నారో అదే వారికి కూడా పెట్టండి. కాకపోతే ఆ ఆహారంలో పోషకాలు తప్పనిసరి.
♥ ఆరు నెలల వయసు నుంచే చిన్నారులకు ఘన పదార్థాలు ఇవ్వవచ్చు. పండ్లు, కూరగాయలను అలవాటు చేయవచ్చు. ఎదుగుతున్న కొద్దీ పిల్లలు వాటిపై ఇష్టం పెంచుకునేలా ప్రోత్సహించాలి.
♥ ఒక్కో కూరగాయను ఓ పాత్రగా చేసి కథలు చెప్పండి. అలా వారికి అన్ని కూరగాయల పట్లా ఆసక్తి పెరుగుతుంది. పండ్లను బొమ్మల ఆకృతిలో ముక్కలు చేసి ఇస్తే.. హుషారుగా తింటారు.
♥ కుటుంబ సభ్యులంతా కలిసి తినే అలవాటును బాల్యం నుంచే పరిచయం చేయాలి. దీనిద్వారా బంధాలు బలపడతాయి. వండిన నాలుగురకాల పదార్థాలూ నోట్లోకి వెళ్తాయి.
♥ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సకాల భోజనం గురించి పిల్లలతో తరచూ మాట్లాడండి. వారినీ మాట్లాడించండి.