మహిళా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను క్రమపద్ధతిలో చెల్లిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్, స్త్రీనిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.18,069 కోట్ల రుణాలను అందించనున్నట్టు వెల్లడించారు.
బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే రుణాల వార్షిక ప్రణాళికను విడుదల చేశారు.2021-22 సంవత్సరంలో మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం, రుణాల రికవరీలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన డీఆర్డీవోలు, సెర్ప్ ఉద్యోగులను సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నదని, మహిళలకు రుణాలు ఇస్తే కచ్చితంగా తిరిగి చెల్లిస్తారని అన్నారు. బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్ఎల్బీసీ కన్వీనర్ కృష్ణశర్మ, నాబార్డు జీఎం హరగోపాల్, ఆర్బీఐ జీఎం యశోదబాయి, సెర్ప్ డైరెక్టర్ వై నర్సింహారెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, డీఆర్డీవో పీడీలు, తదితరులు పాల్గొన్నారు.