‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసి కుర్రకారు హృదయాల్ని దోచుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి. ఎవరికి సాధ్యం కాని చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు చిత్రసీమలో జోరుమీదుంది. భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది.
ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదనే ఉందని.. మరే ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదని చెప్పిందీ భామ. ముఖ్యంగా ప్రేమ విషయాలకు చాలా దూరంగా ఉంటానంది. ఆమె మాట్లాడుతూ ‘ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టాను. కోరుకున్న విధంగా అవకాశాలు లభిస్తున్నాయి.
వైవిధ్యమైన పాత్రల ద్వారా నా ప్రతిభను నిరూపించుకోవాలనుకుంటున్నా. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నా. మరికొన్నేళ్ల పాటు కెరీర్ మీదనే దృష్టి పెడతా. ప్రేమ గురించి ఆలోచించే సమయం అస్సలు లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక కథాంశాల్లో నటించాలనుకుంటున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మాచర్ల నియోజకవర్గం’ ‘ది వారియర్’ చిత్రాల్లో నటిస్తున్నది.