సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఖరారైపోయిందా.? ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న తలైవా రేపో.. మాపో కీలక ప్రకటన చేయనున్నారా..? దేవుడు ఆదేశిస్తే అంటూ ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన కబాలికి దేవుడి నుంచి ఆదేశం అందిందా? సరిగ్గా ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిలనాట చక్కర్లు కొడుతున్నాయి. తమిళ మూవీ విశ్లేషకుడు రమేష్ బాల చేసిన ఓ ట్వీట్ రజనీ పొలిటికల్ ఎంట్రీపై చర్చను మరింత హీటెక్కించింది.
కాగా, డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టిన రోజు ఆ రోజు రజనీ సంచలన ప్రకటన చేస్తారని సినీ విశ్లేషకుడు రమేష్ బాల సంచలన ట్వీట్ చేశాడు. వెంటనే అందరి దృష్టి ఆ ట్వీట్‌పై పడింది. ఆ కీలక ప్రకటన ఏమై ఉంటుందోననేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రజనీ అభిమానులు మాత్రం పొలిటికల్ ఎంట్రీపైనే ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. గత ఏడాదిగా రజనీ రాజకీయరంగ ప్రవేశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రజనీ తన అభిమానులతో సమావేశం కావడం. ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చింది.
అదే సమయంలో రజనీ సోదరుడు మరో అడుగు ముందుకేసి త్వరలో పార్టీ పెడతారని ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పట్నుంచి రజనీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాల చేసిన ట్వీట్‌తో తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. త్వరలో పార్టీ వివరాలు ప్రకటిస్తానని కూడా స్పష్టం చేశారు.
ఇప్పడుఉ రజనీ కూడా అదే మార్గంలో నడుస్తారని రజనీ అభిమానులు, అనుచర వర్గం నమ్ముతోంది. గతంలో రాజకీయ ప్రముఖులు పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉన్న రజనీకాంత్ ఇటీవల కాలంలో రూటు మార్చారు. అవకాశం దొరికిన ప్రతీసారి నేతలతో కలిసి వేదికలను పంచుకుంటున్నారు. తాజాగా ప్రధాని మోడీతోనూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రజనీ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారనేందుకు వీటన్నింటిని ఉదహరిస్తున్నారు విశ్లేషకులు.