త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మూవీకి ఇటీవలే పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. జైలవకుశ తర్వాత తారక్ ఈ సినిమా చేస్తుండటం, త్రివిక్రమ్‌తో ఆయనకు ఇది తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. స్వయంగా పవన్ కల్యాణ్ ఈ సబ్జెక్ట్ ఎన్టీఆర్‌కు నప్పుతుందని చెప్పడంతో షూటింగ్ మొదలు కావడానికి ముందే హైప్స్ పెరిగిపోయాయి. బిగ్ బాస్ సక్సెస్‌తో రెమ్యూనరేషన్ పెంచిన ఈ యంగ్ హీరో త్రివిక్రమ్ సినిమా కోసం దాన్ని తగ్గించాడని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం లేదు.
అయితే, తాజాగా ఈ మూవీపై ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి. క్యాస్టింగ్ విషయంలో తారక్, త్రివిక్రమ్ మధ్య విభేదాలు వచ్చాయని ఓ టాక్ వినిపిస్తోంది. కీలకమైన పాత్ర కోసం టబుని ఎంపిక చేస్తే ఆమె వద్దంటూ తారక్ మొండికేశాడని దాంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని ఓ వార్త హల్చల్ చేసింది. అది నిజమో.. కాదో తేలేలోపే ఇప్పుడు మరో న్యూస్ టాక్ ఆప్ ద టాలీవుడ్ అయింది. అదేమిటంటే.. త్రివిక్రమ్ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా చాలా సమయం ఉండటంతో.. ఎన్టీఆర్ మరో దర్శకుడితో చేతులు కలిపాడనేది ఆ వార్త సారాంశం.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? ఈ ఏడాది ప్రారంభంలో శతమానం భవతితో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సతీష్ వేగెస్నా. సతీష్ వేగెస్నా రెడీ చేసిన కుటుంబ కథ నచ్చడంతో తారక్ ఓకే చెప్పాడని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ను మెటీరియలైజ్ చేసేందుకు నిర్మాత దిల్‌రాజు కంకణం కట్టుకున్నాడని, తారక్ కూడా సినిమా చేసేందుకు డేట్స్ ఇచ్చేశాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ చిత్రం కాస్త ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్తే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌తో పాటు రెండింటినీ హ్యాండిల్ చేసేలా తారక్ ప్లాన్ చేసుకున్నాడట. ఈ చిత్రానికి శ్రీనివాస కల్యాణం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.