హైదరాబాద్ మెట్రోరైలు పరుగులు పెట్టేందుకు సిద్దమైంది.ఈ నెల 28వ తేదీనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సంకేతాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రోరైలుకు చెందిన ముఖ్య అధికారి ఒకరు వెల్లడించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన నేపథ్యంలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు పనులను యుద్ధప్రాతిపాదికన చేపట్టి,రాత్రింబవళ్లు పనిచేసి పూర్తిచేసినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రాజెక్టు ప్రారంభమవుతుందనే విషయాన్ని బలం చేకూర్చడానికి అనేక అంశాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. మూడు పోలీసు కమిషనరేట్ల కమీషనర్ ఆఫ్ పోలీసు ఆఫీసర్లు ఇప్పటికే ఇక్కడ రక్షణ ఏర్పాట్లను పరీక్షించారు. అంతేగాకుండా ఇటీవల గవర్నర్ నరసింహన్, పట్టణాభివృద్దిశాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌తో కలిసి మియాపూర్ నుంచి ఎస్సార్‌నగర్ వరకు ప్రధానమంత్రి ప్రయాణించే మార్గంలోని స్టేషన్లను పరిశీలించారు. పోలీసు అధికారిగా పనిచేసిన గవర్నర్ కూడా భద్రత ఏర్పాట్లను పరిశీలించడం మరింత బలాన్నిస్తుంది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి డీఎస్. మిశ్రా కూడా గత ఆదివారం హైదరాబాద్‌లో ఓ అంతర్జాతీయ కార్యక్రమానికి హాజరై మియాపూర్ డిపోలో జరిగిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన విషయాలు చర్చించినట్లు సమాచారం.ఇవన్నీ ఒక ఎత్తైతే మెట్రోరైలు అభివృద్ధి పనులపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీయడంతో మోడీజీ రాకకు షెడ్యూల్ ఓకే కావడానికి నిదర్శనమని అంటున్నారు.
మొదటిదశ ప్రాజెక్టు ప్రారంభంలో భాగంగా ప్రారంభించేందుకు ప్రతిపాదించిన నాగోల్ నుంచి మియాపూర్ వరకు గల 30 కిలోమీటర్ల మార్గాన్ని మెట్రోరైలు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం చేసారు. ఐతే రైల్వే సేఫ్టీ సర్టిఫికెట్ పొందాల్సి ఉన్నప్పటికీ, ఇది కూడా గడువులోగానే వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ వచ్చిన వెంటనే దీనిని జోడించి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు లేఖ రాస్తే ..దీని ఆధారంగా ప్రధానమంత్రి అధికారిక షెడ్యూలు ఖరారవుతుందని అధికారి తెలిపారు. కారిడార్1లో మియాపూర్ నుంచి ఎస్సార్‌నగర్, కారిడార్ 3లో నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు రెండు సంవత్సరాల క్రితమే సిద్దమైంది. ఇటీవల మెట్రోరైలును అతి త్వరగా అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో మెట్రోపనులను వేగవంతం చేసింది. దీంతో మెట్టుగూడ నుంచి ఎస్సార్‌నగర్ వరకు రైల్వేట్రాక్‌ను సిద్ధం చేశారు. స్టేషన్ పనులు కూడా దాదాపు చివరిదశకు వచ్చాయి. ఈ మార్గంలో ప్రతీ స్టేషన్లో ప్రధానప్రాంతమైన స్టేషన్ మధ్య భాగాన్ని, ఫుట్‌పాత్‌లను అభివృద్ది పరుస్తున్నారు.