మంత్రి పదవి విషయంలో తనకెలాంటి కోపం లేదని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి అంశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను అప్పుడే ఖండించానని చెప్పారు. జగన్ ఆలోచన మేరకే మంత్రి పదవులు వస్తాయన్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి తాను తొలి నుంచి విధేయుడినని చెప్పారు.
ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తానని.. మంత్రి ఆదిమూలపు సురేష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని బాలినేని తెలిపారు. సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని చెప్పారు. కొత్త మంత్రివర్గంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయం జరిగిందన్నారు. అందరికీ ఒకేసారి పదవులు రావని.. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. తన అనుచరులు చేసిన రాజీనామాలను వారు త్వరలోనే విరమించుకుంటారని చెప్పారు.