ఏపీ రాజధాని అమరావతి అంశంలో సీఎస్ సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈనెల 3వ తేదీలోపు రైతులకు ఇచ్చిన స్థలాల్లో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ అఫిడవిట్ సమర్పించారు. మొత్తం 190 పేజీల అఫిడవిట్‌ను కోర్టులో అందజేశారు.
ఆ అఫిడవిట్ ప్రకారం హైకోర్టు నిర్దేశించిన గడువులోపు రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. రాజధాని అమరావతి ప్రాంతం నుంచి నిర్మాణ కార్మికులు వెళ్లిపోయారని తెలిపింది. నిర్మాణాలు చేపట్టి పూర్తిచేసేందుకు కనీసం 6 నెలల నుంచి 60 నెలల సమయం పడుతుందని అఫిడవిట్‌లో పేర్కొంది. గతంలో రూ.42వేలకోట్లకుపైగా నిధులతో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించారని.. ప్రస్తుతం నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. అమరావతి ప్రాంతానికి వర్కర్లు, యంత్రాలు రప్పించేందుకు కనీసం 2నెలల సమయం పడుతుందని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.