విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి విమర్శించారు. 55వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో ఎవరైనా సారా తయారీ చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు పదేపదే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తుండటంతో సీఎం మాట్లాడారు. సారా తయారీ దారులపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు.
ఎక్కడో మారుమూల పల్లెల్లో అంటే నమ్మడానికి అర్థముంటుందని.. వార్డు సచివాలయాలు, పోలీస్‌స్టేషన్, మున్సిపల్ వ్యవస్థ ఉన్న జంగారెడ్డిగూడెంలో సారా తయారీ సాధ్యమేనా? అని టీడీపీని జగన్ నిలదీశారు. సారా తయారీ, మద్యం అక్రమంగా విక్రయించడాన్ని అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసిందని.. ఇప్పటి వరకు 13వేలకు పైగా కేసులు నమోదు చేశాని సీఎం వివరించారు. జంగారెడ్డిగూడెంలో మరణాలన్నీ ఒకే రోజు జరిగినవి కాదని.. వారం, పది, పదిహేను రోజుల గ్యాప్‌లో చనిపోయారని చెప్పారు. దహన సంస్కారాలు పూర్తికాని డెడ్‌బాడీలకు మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయిస్తున్నామన్నారు. ఏ కారణంతో చనిపోయారనేది తెలుస్తుందని చెప్పారు.
టీడీపీ నేతలు అబద్దాన్ని పదేపదే చెప్తే ప్రజలు నమ్మేస్తారనే ఆలోచనతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చంద్రబాబు మాట్లాడే మాటలు ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఆదాయం కోసం ప్రజల్ని విపరీతంగా తాగిస్తున్నారంటూ ఆయన విమర్శలు చేస్తున్నారని.. మళ్లీ ఆయనే సారా తాగి మనుషులు చనిపోయారంటూ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సారా తాగిసతే ప్రభుత్వానికే ఆదాయం తగ్గిపోతుంది కదా? అని జగన్ ప్రశ్నించారు. జరగని సంఘటనలు జరిగినట్లు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.