కోల్‌కతా: గురువారం వెల్లడైన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగుచోట్ల బీజేపీ, ఒక చోట ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందడంపై బీజేపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ఈ ఎన్నికల విజయం 2024 లోక్‌సభ తీర్పును రిఫ్లెక్ట్ చేస్తోందని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం నిజమైన ప్రజాతీర్పు కాదని.. ఎన్నికల స్టాఫ్ సాయంతో గెలిచారని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేయడంపై దీదీ తనదైన శైలిలో విమర్శించారు. వారు పగటికలలు కనడం మానేయాలంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ కోసం ఎదురుచూడటంలో ఉపయోగం లేదని మమతా వ్యాఖ్యానించారు. ఇక ఎలా ముందుకెళ్లాలనేదానిపై వాళ్లే నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలంటూ విపక్ష పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలని సూచించారు.