హైదరాబాద్: శాసనసభలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు.
ఏమైందంటే..
బడ్జెట్‌పై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై రేవంత్‌రెడ్డి స్పందించిన తీరుపై వ్యాఖ్యలు చేశారు. సభలో పోడియం వద్దకు వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారని.. ఆ క్రమంలో స్పీకర్ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత రోజు బీజేపీ ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కంటే కాంగ్రెస్ అధ్యక్షుడు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అవిభక్త కవలల మాదిరిగా వారి ప్రవర్తన ఉందని.. అదేంటో తమకు అర్థం కావడం లేదన్నారు.
అదే సమయంలో భట్టి విక్రమార్క గురించి కేటీఆర్ మాట్లాడుతూ ఆయన చాలా మంచివారని చెప్పారు. కానీ దురదృష్టకరమేంటంటే కాంగ్రెస్‌లో భట్టి గారిది నడుస్తలేదు.. అక్కడ గట్టి అక్రమార్కులు ఉన్నారు.. వాళ్లదే నడుస్తుంది అని వ్యాఖ్యానించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని.. కానీ వారిని సస్పెండ్ చేసిన తీరు సరిగా లేదన్నారు. రేవంత్‌రెడ్డి సభలో లేరని.. ఆయన గురించి మాట్లాడటం సరికాదని అభ్యంతరం చెప్పారు.