విజయవాడ: ప‌్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. టీచర్లను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మార్చి 15 నుంచి నాడు-నేడు కార్యక్రమం కింద రెండో విడత పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో టీచర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న సెంటర్లలో సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో స్కిల్ డెవలప్ కాలేజ్‌తో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీఐ కాలేజ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు ఓపెన్ అయ్యేసరికి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందించాలని చెప్పారు. అన్ని స్కూళ్లలో గేమ్స్ కోసం స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్కిల్ అండ్ హ్యుమన్ రిసోర్సెస్‌కి అడ్రస్‌గా ఏపీ మారాలని జగన్ ఆకాంక్షించారు.